
‘‘డ్రగ్స్ కేసుపై తమను మాట్లాడొద్దని చెప్పడానికి డీజీపీ ఎవరు? ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించే హక్కు మాకు లేదా? ఇంత జరిగినా సీఎం స్పందించరా? ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం’’ అని టీడీపీ నేత, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వత వచ్చిన పెట్టుబడి ఏదైనా ఉందంటే.. రాష్ట్రానికి రూ.72000కోట్ల డ్రగ్స్ ను తీసుకురావడమేనని వ్యంగ్యంగా విమర్శించారు. ఇంత పెద్ద రాకెట్ బయటపడ్డాక కూడా జగన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. నిజానిజాలు తెలుసుకోవడానికి పోలీసులతో విచారణ చేయించాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అదేదో పిక్ పాకెట్ కేసు అన్నట్టుగా ఒక ప్రకటన చేసి వదిలేస్తే సరిపోతుందా? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? అని డీజీపీని నిలదీశారు. ఒక తరాన్ని నిర్వీర్యం చేసేంత ప్రభావం ఈ కేసుకు ఉందన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఎన్ని దేశాలు, రాష్ట్రాలు డ్రగ్స్ వల్ల నాశమైపోయాయో పోలీసులకు తెలియంది కాదని అన్నారు. తామేదో మాట వరుసకు తాలిబన్ల పరిపాలన అంటే.. వీళ్లు ఏకంగా ఆప్ఘనిస్థాన్ తో లింకులు పెట్టుకొని డ్రగ్స్ దిగుమతి చేసుకోవడం మామూలు విషయం కాదన్నారు. చంద్రబాబు గారి హయాంలో సంక్షమానికి, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాష్ట్రం.. ఇప్పుడు స్మగ్లర్లకు, డ్రగ్స్ కు నిలయంగా మారడం బాధ కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందు టీడీపీ హయాంలో ఎన్నో ప్రయత్నాలు చేశామని, దేశ విదేశాలు తిరిగి కంపెనీలను తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పే దమ్ము సీఎంకు ఉందా? అని నిలదీశారు.