
పెట్రోలు, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ ఏపీ వ్యాప్తంగా నిరసనలకు దిగింది. అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు శనివారం ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. విజయవాడలో ధర్నా చౌక్ వద్ద టీడీపీ నేతలు మహాధర్నా నిర్వహించారు. టీడీపీ నేత గద్దె రామ్మోహన్ తన నివాసం నుండి సైకిల్ పై ర్యాలీగా వెళ్లారు.
ఈ మహాధర్నాలో బోండా ఉమ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీనే అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పెట్రో ధరల విషయమై చంద్రబాబుపై విమర్శలు చేశారని, ఇప్పుడేమి సమాధానం చెబుతారని గద్దె ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పన్నులు, రోడ్డు సెస్సులు పెంచిందని ఆరోపించారు.
గుంటూరు, చిత్తూరు, అనంతపురం, కడప, శ్రీకాకుళం జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాల్లోనూ టీడీపీ నేతలు ర్యాలీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో టీడీపీ బైక్ ర్యాలీకి పిలుపునివ్వగా పోలీసులు నిరాకరించారు. పోలీసుల తీరుకు నిరసనగా కొత్తపేట జాతీయ రహదారి నుంచి కోటబొమ్మాళి రైతు బజార్ వరకు నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీకి పిలుపు నిచ్చిన బీటెక్ రవి నివాసం వద్ద పోలీసులు మోహరించారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ నుంచి కాలవ శ్రీనివాసులు పాదయాత్ర చేపట్టారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో తమ నాయకులను అరెస్టు చేయడంపై టీడీపీ మండిపడింది. నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నేతలు నిరసనకు దిగారు.