
సొంత నియోజకవర్గ ప్రజల బాగోగులు చూసి రావడానికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వెళ్లినా, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి విజయవాడ, గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లినా సరే .. ఆయనకు టీడీపీ జెండాలతో పాటు మరో జెండా కూడా స్వాగతం పలకడం తప్పనిసరిగా మారింది. అదే జూనియర్ ఎన్టీఆర్ జెండా. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బాధ కంటే ఎక్కువగా టీడీపీ కార్యకర్తల చేతుల్లో జూనియర్ ఎన్టీఆర్ జెండాల రెపరెపలే చంద్రబాబుకు నిద్ర లేని రాత్రిళ్లు మిగుల్చుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు. తెలుగు నేలపై చెరిగిపోని ముద్ర వేసిన మహా నాయకుడు. పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయినా, తెలుగుదేశం పార్టీ మూల స్తంభాల్లో చంద్రబాబు కూడా కీలకం. టీడీపీ అధ్యక్ష, ముఖ్యమంత్రి పదవుల నుంచి అత్యంత చాకచక్యంతో ఎన్టీఆర్‌ను తప్పించినా, పార్టీని నిలబెట్టడంలో చంద్రబాబు సేవలు మరుపురానివి. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, మూడు సార్లు ప్రతిపక్ష నేతగా అరుదైన రికార్డు సాధించిన చంద్రబాబు నాయుడుకు పార్టీ వర్గాలు జూ. ఎన్టీఆర్‌కు జై కొట్టడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు.
జీవితాన్ని పార్టీ కోసం అంకితం చేసిన త్యాగానికి ఫలితంగా, కుమారుడు లోకేశ్ కు పార్టీ పగ్గాలు, భవిష్యత్‌లో ముఖ్యమంత్రి సీటును చంద్రబాబు కానుకగా ఆశిస్తున్నారు. అయితే, కార్యకర్తలు మాత్రం చంద్రబాబుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. టీడీపీ బతికి బట్టకట్టాలంటే, ప్రజల్లో చరిష్మా కలిగిన జూ. ఎన్టీఆర్ రావాలని బలంగా కోరుకుంటున్నారు. టీడీపీ శ్రేణుల ఆశలను అర్థం చేసుకున్న చంద్రబాబు నాయుడు సడెన్‌గా లోకేశ్ ను పాలిటిక్స్‌లో యాక్టివేట్ చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఆయన నిర్వహించిన కార్యక్రమాలను తండ్రీకొడుకులు బాగా ఫాలో అయ్యారనే అనుమానాలు ప్రస్తుతం లోకేశ్ వ్యవహారం చూసిన వారికి కలుగుతున్నాయి. ప్రజలను లోకేశ్ ఓదారుస్తున్న శైలి అచ్చుగుద్దినట్లు జగన్ గతంలో చేసిన ఓదార్పు యాత్రను పోలి ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ధర్నాలు, ఉద్యమాలు, నిరసన ప్రదర్శనల్లో కూడా లోకేశ్ గతంలో కంటే ఎంతో మెరుగ్గా, చురుకుగా పాల్గొంటున్నారు. వైసీపీ నేతలతో ఒకప్పుడు పప్పు పప్పు అని ట్రోలింగ్‌కు గురైన లోకేశ్… ఇప్పుడు స్పష్టమైన తెలుగులో తప్పులు దొర్లకుండా మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వాన్ని నిద్ర పోనీయకుండా చేస్తున్నారు. కార్యకర్తలకు అండగా నిలబడి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ కోసం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ను సానపడితే, పప్పు వ్యాఖ్యల నుంచి నిప్పుగా మారాడని లోకేశ్‌ను గమనించిన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.