
టీటీడీ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు.. భక్తులను తీవ్రంగా ఇబ్బందుల పాల్జేస్తున్నాయి. మొన్నటి వరకు సర్వదర్శనాల టోకెన్లను తిరుపతిలో అందించిన టీటీడీ.. తాజాగా ఈ టోకెన్లను ఆన్ లైన్ లో అందించాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా తిరుపతిలో ఉన్న సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలను మూసివేసింది. విషయం తెలియని దూరప్రాంతాల భక్తులు.. తిరుపతి చేరుకున్నాక విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. టీటీడీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్ లైన్ టోకెన్ల కోసం అందరూ ఒక్క ఉదుటున ఇంటర్నెట్ సెంటర్లపై పడ్డారు. భక్తులు వేలాదిగా ఉండడంతో.. ఏమీ చేయలేకపోయిన ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు.. షట్టర్లు వేసేసి వెళ్లిపోయారు. దీంతో భక్తులు.. వేలాదిగా టీటీడీ కార్యాలయాల ముందు ధర్నాకు దిగారు. తమను దర్శనానికి అనుమతించాలని డిమాండ్ చేశారు.
శ్రీవారి ఉచిత దర్శనాల టోకెన్ల కోసం శుక్రవారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. టోకెన్లు అయిపోయిన విషయం తెలియక ఉదయమే తిరుపతిలోని శ్రీనివాసం అతిథి గృహానికి చేరుకున్న వీరంతా అవస్థలు పడాల్సి వచ్చింది. పెరటాసి నెల శనివారాలు కావడంతో తమిళనాడు నుంచి భక్తులు ఎక్కువగా వచ్చారు. అయితే 24వ తేదీ టోకెన్లను 22నే కేటాయించేసిన టీటీడీ ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా ప్రచారం చేయలేదు. కనీసం అధికారికంగా పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదు. ఈ విషయం తెలియక శ్రీనివాసం వద్దకు చేరుకున్న వారిని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు బలవంతంగా ఆర్టీసీ బస్టాండు లోపలకు పంపేశారు.