
జనసేన ఆధ్వర్యంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున కాటన్ బ్యారేజీపై తలపెట్టిన శ్రమదానం కార్యక్రమానికి అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ బ్యారేజీపై గుంతలుపడిన రోడ్లను బాగు చేయడం ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలపాలని పవన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అనుమతి కోసం జనసేన దరఖాస్తు చేయగా.. అధికారులు అనుమతి నిరాకరించారు. కాటన్ బ్యారేజీ.. అత్యంత పురాతనమైనది, సున్నితమైనదని, నిపుణుల సూచనలు లేకుండా దానిపై గుంతలు పూడ్చితే.. మొత్తంగా బ్యారేజీ దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. నిజానికి ఈ బ్యారేజీపై రాకపోకలకు కూడా అనుమతి నిరాకరించాల్సి ఉందని, కానీ.. మానవతా దృక్పథంతో ప్రజల రాకపోకలకు అనుమతించామని తెలిపారు. ఈ రోడ్డు ఆర్ అండ్ బీ పరిధిలోకి రాదని, దీనిపై ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టవద్దని సూచించారు.
కాగా, అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో శ్రమదానం ద్వారా రోడ్లను మరమ్మతు చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ఉన్న కాటన్ బ్యారేజీపై శ్రమదానం చేసి.. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు అనంతపురం జిల్లా పుట్టపర్తి-ధర్మవరం రోడ్డుకు పడ్డ గుంతలను పూడ్చే కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒక రోడ్డును తీసుకుని బాగు చేయాలని జనసేన కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కాటన్ బ్యారేజీపై కార్యక్రమానికి అధికారులు అనుమతి నిరాకరించారు. మరోవైపు అనుమతి లేకపోయినా ఈ కార్యక్రమాన్ని జరిపి తీరుతామని జనసేన ప్రకటించింది. ఓ మంచి కార్యక్రమాన్ని తలపెట్టామని, దీనికి ప్రభుత్వం ఎందుకు అడ్డుచెబుతోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహన్ ప్రశ్నించారు. జనసేన ఎల్లుండి చేపట్టనున్న శ్రమదానాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ప్రభుత్వం రోడ్లు బాగు చేయదని, తాము చేస్తామంటే అభ్యంతరం పెట్టడం సబబుకాదని అన్నారు. మంచిపని చేస్తున్నామని, అందుకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేసే విషయాన్ని ఈ సాయంత్రంలోగా తేల్చేస్తామని తెలిపారు. దీనిపై బీజేపీతో చర్చిస్తున్నామని, ఏకాభిప్రాయానికి వచ్చాక నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొన్నారు.