
రాజధాని అమరావతి ఉద్యమం కోసం అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు అనూహ్యమైన, భారీ మద్దతు లభించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తిరుపతి టూర్ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలకు ఆయన అమరావతి ఉద్యమంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. అమరావతిపై ఆ ప్రాంత రైతులు, మహిళా రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ శ్రేణులు సైతం మహా పాదయాత్రలో పాల్గొనాలని అమిత్షా ఆదేశించారు.
రాజధానికి భూములిచ్చిన రైతుల పోరాటానికి అనుకూలంగా పార్టీ తీర్మానం చేసిన తర్వాత పార్టీ వైఖరి భిన్నంగా ఎందుకు ఉంటుందని అమిత్ షా రాష్ట్ర నేతలను ప్రశ్నించారు. ఇతర పార్టీలతో పొత్తుల విషయంపై రాష్ట్ర నేతలు ఎవరూ మాట్లాడవద్దని అమిత్షా హెచ్చరించారు. పొత్తుల విషయంలో కేంద్ర నాయకత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని అమిత్షా స్పష్టం చేశారు. వైసీపీ సర్కార్ తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలపై కచ్చితంగా పోరాడాలని ఆయన పార్టీ వర్గాలకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలని అమిత్షా రాష్ట్ర నేతలకు మార్గనిర్దేశం చేశారు.