
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. సరిగ్గా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించిన రోజే తెలంగాణలో సంజయ్ పై దాడి జరిగింది. ఈ అంశం అమిత్ షా దృష్టికి వెళ్లడంతో మంగళవారం ఉదయమే సంజయ్ కు ఫోన్ చేసి ఆరా తీశారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై డీజీపీతో మాట్లాడతానని భరోసా ఇచ్చారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, రైతులకు అండగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ పై పోరాటం కొనసాగించాలని సూచించారు.
మరోవైపు బండి సంజయ్‌పై దాడి, పోలీసులు వ్యవహారశైలిపై గవర్నర్ తమిళిసైకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు ఈటల, రఘనందనరావు, రాజసింగ్, ముఖ్య నేతలు డీకే అరుణ, లక్ష్మణ్, గరికపాటి, విజయరామారావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఆమెతో భేటీ అయ్యారు. బీజేపీ గెలుపును జీర్ణించుకోలేక టీఆర్ఎస్ దాడులు చేస్తోందని ఫిర్యాదు చేశారు.
భయానక వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. బెంగాల్ తరహా రాజకీయాలు తెలంగాణలో చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. స్వయంగా సీఎంయే మెడలు నరికేస్తాం.. ఆరు ముక్కలు చేస్తామంటూ మాట్లాడారని గుర్తు చేశారు. అనంతరం డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ సీఎం తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లమాన్నారు. ప్రతిపక్షంగా తప్పకుండా ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రైతుల బాధలు పట్టించుకోకుండా తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వేల కోట్లు ఖర్చు చేశారని డీకే అరుణ విమర్శించారు. అనేక అబద్ధపు హామీలు చేసిన హుజూరాబాద్ ప్రజలు లొంగకుండా… బెదరకుండా స్పష్టమైన తీర్పు నిచ్చారన్నారు. ఎన్నికలు, ఓట్లు వస్తే తప్పా సీఎం ఏం చేయలేని పరిస్థితి ఉందని ఆరోపించారు. కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందన్నారు. ప్రతీ ఐకేపీ సెంటర్లలో రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.