
ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న ఆయన.. స్థానిక తాజ్ హోటల్ లో రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరితో అమిత్ షా చర్చిస్తున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ.. ఏపీలో మాత్రం ఎందుకు బలపడలేక పోతున్నామని ఎంపీలను షా అడిగినట్లు తెలుస్తోంది. పార్టీ బలపడేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాల్సిందిగా సూచించినట్లు సమాచారం. సుదీర్ఘంగా సాగుతున్న ఈ సమావేశంలో.. టీడీపీతో పొత్తు అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
టీడీపీతో ముందస్తుగా కలిసి పనిచేస్తే.. ఇరు వర్గాల మధ్యా క్షేత్ర స్థాయిలో సంబంధాలు మెరుగవుతాయని, దీంతో.. ఎన్నికల నాటికి బలపడేందుకు అవకాశం ఉంటుందని ఎంపీలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ.. దీని వల్ల ఆశించిన ఫలితం రావడం లేదని వారు అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన.. ఈ విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఈ లోగా పొత్తు విషయాలను పక్కనబెట్టి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని కోరినట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో క్రమంగా పార్టీ బలపడుతోందని, కర్ణాటకలో ఇప్పటికే అధికారంలో ఉండగా.. తెలంగాణలో అధికారం దిశగా సాగుతున్నామని అమిత్ షా అన్నారు. తమిళనాడు, కేరళలో కూడా పార్టీ బలోపేతం అవుతోందని, ఏపీలో అక్కడి తరహాలోనే సాగాలని సూచించినట్లు సమాచారం.