
టీఎస్ ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్న అధికారులు.. మరో ముందడుగు వేశారు. ప్రముఖ ఆన్ లైన్ కొనుగోళ్ల సంస్థ అమెజాన్ తో ఇటీవల చర్చలు జరిపారు. ఆర్టీసీ కార్గో ద్వారా వస్తువుల రవాణాకు త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క బస్సు డిపోనూ ఎత్తివేయబోమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ప్రభుత్వ రంగ సంస్థలను తాము అమ్మబోమని, నష్టాల్లో ఉన్న సంస్థలను సైతం నడిపించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
ప్రస్తుతం ఆర్టీసీలో కార్గో పార్శిల్ సర్వీసులను విజయవంతంగా నడిపిస్తున్నామని తెలిపారు. దీన్ని మరిత వేగవంతం చేసేందుకు అమెజాన్ సంస్థతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇప్పటికే 195 బస్సుల ద్వారా కార్గో సేవలు అందిస్తున్నామని, త్వరలోనే మరో 50 బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. హోం పికప్, హోం డెలివరీ పార్శిల్ సేవలనూ ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఏపీలో తిరుమల వెళ్లే భక్తులు టికెట్టుకు అదనంగా రూ.300 చెల్లిస్తే.. వేంకటేశ్వరస్వామి దర్శనం కూడా ఆర్టీసీనే కల్పిస్తోందని, అలాంటి సౌకర్యాన్నే ఇక్కడా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వివరించారు.