
కూరగాయల నుంచి సెల్ ఫోన్ దాకా ఆన్ లైన్ కొనుగోలు వేదికల్లో ఇప్పుడు దొరకనిదంటూ ఏమీ లేదు. ఏ వస్తువు కొనాలన్నా ఆన్ లైన్ లో ఆర్డర్ ఇవ్వడం.. అది ఇంటికే డెలివరీ కావడం సర్వ సాధారణమైపోయింది. ఇక, జొమాటో, స్విగ్గీ వంటి సంస్థల సేవలు పెరిగాక రెస్టారెంట్లకు వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది. కోరుకున్న ఆహారం తలుపు తట్టి అందజేస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఇది మరింత జోరందుకుంది. అయితే, హైదరాబాదీల్లో మాత్రం ఒక అసంతృప్తి ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. మద్యం కూడా హోం డెలివరీ చేస్తే బాగుంటుందని ఎక్కువ మంది భాగ్యనగర వాసులు అభిప్రాయపడుతున్నారు. హోం డెలివరీ చేయడం ద్వారా మద్యం ధరల్లో పారదర్శకత వస్తుందని 100శాతం మంది పేర్కొన్నారు.
ఇప్పటికే మేఘాలయ, పంజాబ్, పుదుచ్చేరి, ఢిల్లీ, అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఒడిశాలో మద్యం హోం డెలివరీ చేస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఆ దిశగా అడుగులేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మద్యం హోం డెలివరీ సేవలపై ఇంటర్నేషనల్ స్పిరిట్ అండ్ వైన్స్ ఆఫ్ ఇండియా ఇటీవల 8 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. తెలంగాణలోని హైదరాబాద్ తోపాటు ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ పట్టణాల్లో 7500 మంది అభిప్రాయాలు సేకరించింది. అందుకు సంబంధించిన నివేదికను కన్జ్యూమర్ పల్స్ ఆన్ హోం డెలివరీ ఆఫ్ లిక్కర్ పేరిట ఇటీవల విడుదల చేసింది.
ఈ మేరకు హోం డెలివరీ చేస్తే నాణ్యమైన మద్యం లభిస్తుందని 63 శాతం మంది, కల్తీని అరికట్టవచ్చని 37శాతం మంది, సౌలభ్యంగా ఉంటుందని 60శాతం మంది, కొవిడ్ నేపథ్యంలో భౌతిక దూరం పాటించే అవకాశం ఉంటుందని 40శాతం మంది, ప్రస్తుతం ఉన్న ఈ కామర్స్ యాప్ ల ద్వారానే హోం డెలివరీ ఉండాలని 60శాతం మంది విన్నవించారు. హైదరాబాద్ కాకుండా మిగతా నగరాల్లోని పౌరుల్లో 70శాతం మంది లిక్కర్ హోం డెలివరీ కావాలని కోరారు.