
‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి. ఆ సినిమా విజయంతో ఆయనకు యువతలో క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలోనే ఆయన తెరకెక్కించిన సరికొత్త చిత్రం ‘మహాసముద్రం’. తాను ఎప్పుడో రాసుకున్న కథను పట్టుకుని పలువురు హీరోల చుట్టూ తిరిగాడు. చాలా మంది ఈ కథను తిరస్కరించారు. అయితే చివరకు అజయ్ భూపతి కథకు శర్వానంద్, సిద్ధార్థ్ పచ్చజెండా ఊపారు. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఆ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చింది. అంతేకాదు.. రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ‘మహా సముద్రం’ను నిర్మించింది.
ప్రేమ, స్నేహాం, వైరం వంటి సున్నితమైన అంశాలతో సిద్ధమైన ఈ కథ అజయ్ భూపతి కలల ప్రాజెక్ట్‌గా ప్రచారం పొందింది. కానీ కథలో బలం లేకపోవడం, సన్నివేశాలు ఆసక్తిని కలిగించకపోవడం, పాటలు సైతం నిరాశకు గురిచేయడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయాన్ని అందుకోలేదు.