
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే మదుపరులందరూ ఆధార్ తో పాన్ కార్డును అనుసంధానం చేసుకోవాల్సిందేనని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) స్పష్టం చేసింది. ఇందుకు ఈ నెల 30వ తేదీని డెడ్ లైన్ గా ప్రకటించింది. ఎవరైనా అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు పని చేయదని, కేవైసీ వివరాలు అసంపూర్తిగా మిగిలిపోతాయని పేర్కొంది. మార్కెట్ లావాదేవీలు నిరంతరం సాఫీగా సాగాలంటే ఆధార్, పాన్ అనుసంధానం చేసుకోవాల్సిందేనని తెలిపింది.
2021 సెప్టెంబరు 30వ తేదీలోపు ఆధార్ తో అనుసంధానం చేయకుంటే 2017జూలై 1 కన్నా ముందు జారీ చేసిన పాన్ కార్డులేవీ పని చేయబోవని గత ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ప్రస్తావిస్తూ తాజాగా సెబీ సైతం మదుపరులకు సూచనలు జారీ చేసింది. అయితే, అస్సోం, జమ్ము కశ్మీర్, మేఘాలయ వాసులతోపాటు 80 ఏళ్లు దాటిన వారు, విదేశీ పౌరులకు ఈ నిబంధన వర్తించదు. ఇప్పటిదాకా ఆధార్ తో పాన్ కార్డును అనుసంధానం చేసుకోనివారు… ఇన్ కంటాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్ లో లాగిన్ అయి లింక్ విత్ ఆధార్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.