
ఓ సమయం, సందర్భం లేకుండా.. అసలు తమకు సంబంధం లేని విషయాల్లో కూడా తలదూర్చుతూ.. కేంద్రానికి లేఖలు రాస్తున్న తెలంగాణ తీరుపై ఏపీ మండిపడింది. హంద్రీ-నీవా సుజల స్రవంతికి నీటిని విడుదల చేయొద్దంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవనడాన్ని తప్పుబట్టింది. రాష్ట్ర విభజన చట్టంలోనే ఆ పథకానికి రక్షణ కల్పించారని గుర్తుచేసింది. ఏపీ నీటి ప్రాజెక్టులపై రోజుకో మాట మాట్లాడుతున్న తెలంగాణపై ఏపీ జలవనరుల శాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘‘తెలంగాణ నిర్మించిన నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు, ఎలిమినేటి మాధవరెడ్డి, భీమా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నాయా? కృష్ణా బోర్డు పరిధి గెజిట్ లో ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు లేనందున.. దానికి ఏఐబీపీ కింద నిధులివ్వరాదని కేంద్రానికి ఎలా లేఖ రాస్తారు? తెలంగాణ వైఖరి సరిగా లేదు. ఏపీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా అసందర్భంగా లేఖలు రాస్తోంది’’ అని అధికారులు మండిపడ్డారు. శ్రీశైలం జలాశయాన్ని జలవిద్యుదుత్పత్తి కోసం నిర్మించిన ప్రాజెక్టుగా చూపిస్తూనే.. దానిపై ఎత్తిపోతల పథకాలను ఎలా నిర్మిస్తోందని ఏపీ అధికారులు ప్రశ్నించారు.
‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా ట్రైబ్యునల్ 811 టీఎంసీలను కేటాయించింది. విభజన తర్వాత మాకు 512 టీఎంసీలు.. తెలంగాణకు 299 టీఎంసీలు దక్కాయి. ఇందులో.. ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్లో ఎక్కడా చెప్పలేదు. మరి అలాంటప్పుడు తెలంగాణ లేఖ రాయడంలో అసలు అర్థమే లేదు. తాము చేపట్టినవన్నీ పాత ప్రాజెక్టులే అని చెబుతున్నారు. ఇటీవల కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ గెజిట్లో పేర్కొన్న అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితాలో.. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల మూడోదశ, తుపాకులగూడెం, చిన్న కాళేశ్వరం, రామప్ప-పాకాల అనుసంధానం, కాళేశ్వరం-3, మొండికుంటవాగులు ఉన్నాయి. వీటికి తాజాగా డీపీఆర్ లను సిద్ధం చేస్తున్నారు. అంటే.. దీని అర్థం ఏంటి! ఇవన్నీ కొత్త ప్రాజెక్టులనే కాదా! ముందుగా ఈ డీపీఆర్ లకు తెలంగాణ సమాధానం చెప్పాలి. వీటికి కృష్ణా జలాలను మళ్లించకుండా బోర్డులు చర్యలు తీసుకోవాలి’’ అని ఏపీ జలవనరుల శాఖ అధికారులు కోరారు.