
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సీఎం కేసీఆర్ పై మరోసారి ఘాటు విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు గురించి ప్రస్తావిస్తూ ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు రోజు రోజుకీ పెంచుకుంటూ పోతున్నారని, రూ.38,500 కోట్లతో మొదలైన లక్ష 20 వేల కోట్లకు చేరుకుందని అన్నారు. మేఘా ప్రాజెక్టులకు డబ్బులు కట్టబెట్టేందుకు సీఎం కేసీఆర్ దొర అప్పులు చేసి మరి కుమ్మరిస్తారు కానీ, సంక్షేమ పథకాల అమలుకు మాత్రం భూములు అమ్ముకోవాలంటూ ఎద్దేవా చేశారు. ‘‘మీది దేశంలోనే అద్భుత ‘మేఘ’ పరిపాలన దొర గారు” అంటూ కేసీఆర్ పాలనపై విమర్శలు చేశారు. తెలంగాణలో సమస్యలపై అధికార పార్టీని ప్రశ్నిస్తున్న షర్మిల ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలపై ఫోకస్ పెట్టారు. ప్రతి మంగళవారం ఒక ప్రాంతంలో దీక్ష చేస్తూ వస్తున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం చేసేందుకు ‘ఊరూరా వైఎస్ఆర్ జెండా పండుగ’ కార్యక్రమాన్ని గురువారం నుంచి తలపెట్టాలని షర్మిల పిలుపునివ్వడం తెలిసిందే.
ఫీజు రీయింబర్స్మెంట్ కు పైసలు లేవు .. రైతు రుణమాఫీకి డబ్బులు లేవు .. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భూములు అమ్ముకోవాలి, కానీ మేఘా ప్రాజెక్టులకు డబ్బులు కట్టబెట్టడానికి మాత్రం .. అప్పులు చేసి మరి KCR దొర పైసలు కుమ్మరిస్తారు, మీది దేశంలోనే అద్భుత "మేఘ" పరిపాలన దొర గారు. 2/2
— YS Sharmila (@realyssharmila) August 5, 2021