
దేశంలో వాణిజ్య సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి ఎల్పీజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.266 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. నవంబర్ 1 నుంచే సవరించిన ధరలు అమలులోకి రానున్నట్టు వెల్లడించారు. దీంతో వాణిజ్య సిలిండర్ ధర రూ.2000.50కు చేరింది. ఇదివరకు ఈ ధర రూ.1734గా ఉంది. అయితే, గృహావసరాలకు వినియోగించే సిలిండర్ల ధర యథాతథంగా ఉంది.
కాగా, దేశంలో ‘పెట్రో’ బాదుడు కొనసాగుతోంది. తాజాగా లీటర్ పెట్రోల్ పై 37 పైసలు, లీటర్ డీజిల్ పై 36 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.71కు చేరగా.. డీజిల్ ధర రూ.98.44కు పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో చమురు ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోలుపై 41 పైసలు, డీజిలుపై 42 పైసలు పెరిగాయి.హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.09కు చేరుకుంది. మరోవైపు లీటర్ డీజిల్ ధర రూ.106.95గా ఉంది. గుంటూరులో పెట్రోల్ ధర లీటరుకు రూ.116.06కి చేరింది. డీజిలు ధర లీటర్ రూ.108.71గా ఉంది.