
భారత బ్యాడ్మింటన్ తార పీవీ సింధును టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సన్మానించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. ‘దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్లో పతకాలు సాధించిన మన పీవీ సింధు ని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది..’ అని తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను ఇన్స్టాగ్రమ్ వేదికగా షేర్ చేశారు. సింధును చిరంజీవి హైదరాబాదులోని తన నివాసానికి ఆహ్వానించారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య సింధును సత్కరించారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, ఉపాసన, సీనియర్ హీరో నాగార్జున, రానా, సీనియర్ నటీమణులు రాధిక, సుహాసిని కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సింధు సాధించిన విజయాలను చిరు కొనియాడారు. సింధును చూసి దేశం మురిసిపోతుంటే తన బిడ్డే అనే భావన కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవి కుటుంబం తనపై చూపించిన ప్రేమ, గౌరవాన్ని ఎప్పటికి గుర్తుంచుకుంటానన్న సింధు.. వచ్చే ఒలింపిక్స్లో తప్పకుండా బంగారు పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. సింధు సాధించిన కాంస్య పతకంతో ప్రత్యేకంగా ఫొటోలు దిగుతూ సందడిగా గడిపారు. అమ్మవారి విగ్రహాన్ని బహుకరించి సింధు ఆశీర్వదించారు.
దేశం గర్వించే లా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన మన P.V.Sindhu ని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది. #Salute #PVSindhuOurPridehttps://t.co/unXKHu7bwY
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 28, 2021