
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా, హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో వారి డేటా సెంటర్ ను రూ. 1500 కోట్లతో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ ఇండియా సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. కాగా, మరో మూడు ఐటీ కంపెనీలు కూడా ఇదే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మన దేశంలో ఉన్న ప్రస్తుత డేటా సెంటర్ల సామర్థ్యం 30 మెగావాట్లు ఉండగా, 2023 నాటికి ఈ సామర్థ్యం 96 మెగావాట్లకు పెరుగుతుందని ప్రముఖ కన్సల్టింగ్ సేవలు సంస్థ జేఎల్ఎల్ అంచనా వేసింది. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో స్థిరాస్తి వ్యయాలు తక్కువగా ఉండడానికి తోడు ప్రభుత్వం తీసుకునే సానుకూల విధానాలు, ఐటీ నిపుణుల లభ్యత ఎక్కువ గా ఉండడం వల్ల ఇక్కడ డేటా కేంద్రాల ఏర్పాటుకు కంపెనీలు ముందుకు వస్తున్నట్లు సమాచారం. కాగా, అమెజాన్ ఇండియా ఇటీవలే హైదరాబాద్లో డేటా సెంటర్ ఏర్పాటు చేసింది.