
హైదరాబాద్ వాసులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. రాజధానిలో మరో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ ప్రకటించారు. బంగాళాఖాతంపై గాలుల కారణంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. రుతుపవనాల గాలుల వలన ఉపరితల ద్రోణి ఢిల్లీ బాలంగీర్ నుంచి ఒడిశా వరకూ వ్యాపించి ఉందని తెలిపారు. వీటి ప్రభావంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వాన్ని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురవగా.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలనీలు నీట మునిగాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి వరద నీరు వెళ్లిపోయేలా చర్యలు చేపట్టారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తాజాగా వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతోందనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.