
ఇటీవల తనపై నమోదైన కేసుల ర్యాప్తు పేరిట పోలీసులు తనను వేధిస్తున్నారని ‘తీన్మార్’ మల్లన్న ఆరోపించారు. ఈ విషయమై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైదరాబాదులోని మారుతీ జ్యోతిష్యాలయం నిర్వాహకుడు లక్ష్మీకాంత శర్మను డబ్బులు డిమాండ్ చేశాడన్న ఫిర్యాదుపై ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీసులు మల్లన్నపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై మహంకాళి ఏసీపీ రమేశ్, ఇన్ స్పెక్టర్ నరేశ్ లు మల్లన్నను మొన్నీమధ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ చేశారు. ఈ నెల 8న మరోమారు విచారణకు రావాలని మల్లన్నకు చెప్పారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో మల్లన్న పిటిషన్ దాఖలు చేశారు. స్టేషన్ కు పిలవకుండా పోలీసులను ఆదేశించాలని, ఆన్ లైన్ లో విచారణ జరిపేలా చూడాలని తన పిటిషన్ లో మల్లన్న విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. తనపై కేసుల నమోదు వెనుక రాజకీయ కుట్ర ఉందని మల్లన్న ఆరోపించారు. దర్యాప్తు పేరుతో పోలీసులు వేధించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.