
తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. దాంతో పాటు మిజోరాంలోని తురివాల్, మహారాష్ట్రలోని చెగలూరు నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకూ అభ్యర్థులను ప్రకటించింది. అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఈటలపై టీఆర్ఎస్ ప్రభుత్వం వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రభుత్వం మీద ప్రత్యారోపణలు చేస్తూ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పట్నుంచి ఈటల ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. కొన్ని రోజులపాటు పాదయాత్ర కూడా చేశారు.
ఈ నెల 30న ఎన్నిక జరగనుండగా.. వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నట్టు బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించడంతో ఆ నియోజక వర్గంలో త్రిముఖపోటీ జరగనుంది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పోటీ చేస్తున్నారు. కాగా, బీజేపీ నుంచి ఈటల ను ప్రకటించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. మూడు పార్టీలూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.