
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ తన గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ కూడా విజయం కోసం ఎత్తులు పైఎత్తులతో ముందుకు వెళ్తోంది. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున బరిలోకి దింపే వ్యక్తుల పేర్లపై పలు ఊహాగానాలు విన్పిస్తున్నాయి. పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా పంపడంతో ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయమై మళ్లీ చర్చ మొదలైంది. ఈ క్రమంలో మరో పేరు తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నెల 16న హుజూరాబాద్ లో దళితబంధు పథకాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.