
టీఎస్ ఆర్టీసీని కించపరిచేవిధంగా హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థ తీసిన యాడ్ పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు జారీ చేశారు. ‘అల వైకుంఠపురములో…’ సినిమాలోని ఓ పాటలో అల్లు అర్జున్ చేసిన దోశ స్టెప్పు ఎంత పేరు తెచ్చిపెట్టిందో.. ఇప్పుడు అదే దోశ అతడికి తలనొప్పి తెచ్చిపెట్టింది.
రాపిడో సంస్థ ఇటీవలే విడుదల చేసిన ప్రకటనలో అల్లు అర్జున్ నటించాడు. అందులో.. దోశలు వేసే వ్యక్తిగా బన్నీ కనిపించాడు. రాపిడోను ప్రమోట్ చేసే క్రమంలో.. బస్సు ప్రయాణాన్ని దోశతో పోల్చుతూ సంభాషణలు చెప్తాడు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయటం వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నట్లు, అందుకు ప్రత్యామ్నాయంగా ప్రయాణికులు రాపిడో సేవలను వినియోగించుకోవాలని అర్థం వచ్చేలా బన్నీ నటించిన ప్రకటన ఉంది. దీంతో ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. బన్నీకి, రాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపారు.
ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నట్టు సజ్జనార్ తెలిపారు. టీఎస్ ఆర్టీసీ ఎన్నో ఏళ్లుగా సామాన్యుల సేవలో ఉందని.. అలాంటి సంస్థను కించపర్చినందుకే రాపిడోకు, అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చినట్టు సజ్జనార్ పేర్కొన్నారు. ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక వ్యక్తుల నుండి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని సజ్జనార్ పేర్కొన్నారు. మరి ఈ వివాదంపై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడో చూడాలి..