
పెగాసస్ స్పైవేర్ సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు. ఏకంగా లోక్ సభ సమావేశాలని స్తంభింప చేసేలా చేసింది. పెగాసస్ కుంభకోణం ఓ కీలక పరిణామం. ఈ కేసు విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. బుధవారం ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ఈ మేరకు సీనియర్ న్యాయవాది ఉదయ్ సింగ్ తో అన్నారు. దీనిపై వచ్చే వారం ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. పెగాసస్ పై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల్లో చందర్ కూడా ఒకరు.
పెగాసస్ కేసులో విచారణ కోసం సాంకేతిక కమిటీని ఈ వారంలో నియమించాలని సుప్రీం భావించింది. కానీ, ఇందులో సభ్యులుగా ఉండేందుకు నిపుణులు వెనుకంజ వేస్తుండడంతో.. ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఇదే విషయాన్ని సీజేఐ ప్రస్తావిస్తూ.. అతిత్వరలో సభ్యులను ఖరారు చేసి సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కేసులో చివరగా సెప్టెంబరు 13న విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తామని తేల్చి చెప్పింది. ఈ దిశగా మధ్యంతర ఉత్తర్వులను రిజర్వు చేసింది. నాటి నుంచి కమిటీ నియామకంపై సుప్రీంకోర్టు కసరత్తు చేస్తోంది. కాగా, కోర్టు ఆదేశిస్తే నిపుణుల కమిటీతో విచారణ చేయిస్తాం కానీ, ఫోన్లపై నిఘా ఉంచడానికి పెగాసస్ సాఫ్ట్ వేర్ ను వాడామా లేదా అన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్రం మరోసారి విముఖత చూపిన విషయం తెలిసిందే.