
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఆగస్టులోనే బుల్లితెర మీద సందడి చెయ్యబోతున్నారు. ‘బిగ్ బాస్’ ఫస్ట్ సీజన్ తర్వాత తారక్ హోస్ట్ చేస్తున్న ఈ క్రేజీ రియాలిటీ షోపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఎమోషనల్ గా ఆకట్టుకోవడంతో పాటు తారక్ హోస్టింగ్ ఎలా ఉండబోతుందంటూ ప్రేక్షకాభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా రానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం తొలి ఎపిసోడ్ కు అతిథిగా రామ్ చరణ్ వచ్చాడు. ఈ ఇద్దరు రామ్ ల మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ఆగస్టు 22న ఇది ప్రసారం కానుంది.
ఎన్టీఆర్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసి ‘‘ఈనెల 22న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ద్వారా మీ ఇంటిలో సందడి చేయబోతున్నాం. సోదరుడు రామ్ చరణ్ తో కలిసి చేసిన ఈ కర్టెన్ రైజర్ మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నా…” అని ట్వీట్ చేశాడు.
షో లోకి చెర్రీ ఎంట్రీ ఇచ్చి, హోస్ట్ సీట్ లో కూర్చోబోయాడు. వెంటనే అడ్డుపడిన ఎన్టీఆర్.. అది హాట్ సీటు.. ఇది హోస్ట్ సీటు అని చెప్పడంతో చరణ్ వెళ్లి హాట్ సీటులో కూర్చొన్నాడు. అనంతరం ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చివరకు ఎన్టీఆర్ వేసిన ప్రశ్న విన్న తర్వాత ‘సీటు హీట్ ఎక్కుతోంది.. బ్రెయిన్ హీట్ ఎక్కుతోంది’ అంటూ చరణ్ సమాధానం ఇవ్వడం చూస్తుంటే ఈ ఎపిసోడ్ ఆద్యంతం అలరించేలా ఉంటుందని అర్థమవుతోంది. పూర్తి ఎపిసోడ్ ఆగస్టు 22న రాత్రి 8.30 గంటల నుంచి ప్రసారం కానుంది.
నిజానికి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ సీజన్ ను ఎప్పుడో మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ, కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. అయితే, తెర వెనుక గ్రౌండ్ వర్క్ మాత్రం చేస్తూనే ఉన్నారు నిర్వహకులు. ఇటీవలే ఈ షోకు సంబంధించిన షూట్ ను కూడా మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే మొదటి షెడ్యూల్ లో భాగంగా 16 ఎపిసోడ్స్ చిత్రీకరణలు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇవన్నీ ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్‌ను జరుపుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.