
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ఏపీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ఏపీలో అసలు పాలన ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం డబ్బులిస్తే తప్ప సీఎం కారు పెట్రోలుకు కూడా దిక్కులేదని, రాష్ట్రాన్ని దివాలా తీయించారని మండిపడ్డారు. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి తరఫున బుధవారం రఘునందన్ ప్రచారం నిర్వహించారు. రాజుపాళెం – అప్పరాజుపేట మార్గంలో రోడ్ షోలో మాట్లాడారు.
రాష్ట్రానికి రాజధాని ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. అసలు ఈ రాష్ట్రానికి రాజధానులు ఎన్ని? ఒకటా.. రెండా.. మూడా.. లేదా అన్నీ పక్కనబెట్టి కడపనే కొత్త రాజధాని చేస్తారా? మీ రాజధాని ఏది.. చెప్పగలరా జగన్? అని సూటిగా ప్రశ్నించారు. అధికారం ఇస్తే.. సంపూర్ణ మద్యనిషేధం విధిస్తానని చెప్పిన జగన్.. మద్యం ధరను రెండింతలు పెంచేశారని విమర్శించారు. అదేమంటే.. మద్యం రేటు ఎక్కువుంటే జనం తాగడం మానేస్తారని చెబుతున్నారని, ఇలా మానేసిన వాళ్ల లెక్కేమైనా ఉందేమో చెప్పాలని అన్నారు. వచ్చే పెన్షన్ డబ్బులు మద్యం షాపులకే పోతున్నాయని, చిన్న సీసాలు, పెద్ద సీసాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని రఘునందన్ విమర్శించారు.
జగన్ జీవో తెస్తాడు.. కోర్టు దాన్ని కొట్టేస్తుంది. ఈయనో మాట చెబుతాడు. ఎవరో కోర్టుకు పోతారు. అక్కడ కొట్టేస్తారు. అసలిక్కడ పరిపాలన ఉందా? నువ్వు తెచ్చిన ఒక్క పథకమైనా ప్రజలకు చేరుతోందా? ఒక్కసారి గుండెల మీద చేయ్యి వేసుకుని ఆలోచించు. కేంద్రం ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే నిధులను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. సొమ్ములు కేంద్రానివి, సోకులు జగన్ వి. ఈ సీఎం ఎవరికీ అందుబాటులో ఉండడు. ప్రజలను కలవడు. ఎమ్మెల్యేలను కలవడు. మంత్రులను కలవడు. రాష్ట్ర కేబినెట్ లో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. ఈ ప్రభుత్వంలో అంతా రహస్యమే… అని రఘునందన్ రావు తీవ్రంగా మండిపడ్డారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ పోలీసుల అండతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, బీజేపీ నాయకులు, కార్యకర్తలను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడం బాధాకరమని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మీ దగ్గర 13 జిల్లాల పోలీసులుంటే.. మా దగ్గర 30 రకాల పోలీసులున్నారు. మీలాగా మేమూ బెదిరించాలనుకుంటే ఒక్క ఎమ్మెల్యే, మంత్రీ బయట తిరగలేడు. జగన్.. నువ్వు బెదిరిస్తే భయపడే వారెవరూ లేరు. గుర్తు పెట్టుకో.. అని రఘునందన్ హెచ్చరించారు.