
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. సీబీఐ నమోదు చేసిన కేసుల్లో వాదనలకు సిద్ధం కావాలని సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా నిందితుల తరఫు న్యాయవాదులను సీబీఐ కోర్టు ఆదేశించింది. సీబీఐ కేసులతో పనిలేకుండా ఈడీ కేసులను ప్రత్యేకంగా విచారిస్తామని తెలిపింది. దీంతో.. ఈడీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్ వేసినట్లు నిందితుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ మేరకు జగతి పబ్లికేషన్స్ తరపున మెమో దాఖలు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టు జడ్జి బి.ఆర్.మధుసూదనరావు.. విచారణను ఆగస్టు 6కు వాయిదా వేశారు. కాగా, ఎమ్మార్ ప్రాపర్టీస్ పై ఉన్న కేసుల విచారణ ఆగస్టు 4కి వాయిదా పడింది.