
కేసీఆర్ ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగులు గట్టి షాక్ ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6వ తేదీ లోపు ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను చెల్లించాలని, లేని పక్షంలో ఉద్యోగులు సమ్మెబాట పట్టక తప్పదని జేఏసీ నేతలు హెచ్చరించారు. కరోనా సాకుతో కొద్ది నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడం లేదని ఆర్టీసీ జేఏసీ ఆరోపించింది. రవాణా సంస్థలో సమ్మెపై యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ ఇప్పటికే నోటీస్ జారీ చేసింది. ఈనెల 6వ తేదీ లోపు జీతాలు చెల్లించకుంటే, సమ్మెబాట తప్పదని ఉద్యోగులు యాజమాన్యానికి స్పష్టం చేశారు. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకు జేఏసీ పలుమార్లు లేఖ రాసినా స్పందించక పోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో తీవ్ర నష్టాల పాలైన తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ ను సీఎం కేసీఆర్ సర్కార్ ఏమాత్రం ఆదుకోవడం లేదని ఆర్టీసీ జేఏసీ ఆరోపించింది. ఆర్థికంగా చితికి పోయిన ఆర్టీసీని టీఆర్ ఎస్ ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేసింది.