
సమంత-నాగచైతన్య పరస్పర అవగాహనతో తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎందుకు విడిపోతున్నారో వారిద్దరూ క్లారిటీ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతూనే ఉంది. మరోవైపు సమంత ఎప్పటికప్పుడు పోస్టింగ్స్ తో మరింత రచ్చ పుట్టిస్తోంది. మహిళలు ఏం చేసినా ప్రశ్నించే ఈ సమాజం, మగాళ్లను మాత్రం ఎందుకు ప్రశ్నించదంటూ నిలదీసింది. తనకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లలను వద్దనుకున్నానని.. అవకాశవాదినని అన్నారని.. ఇప్పుడేమో అబార్షన్స్ కూడా జరిగాయని అంటున్నారని మండిపడింది. విడాకులు అనేది చాలా బాధనిస్తుందని, ఆ బాధ నుంచి కోలుకోవడానికి కాస్త సమయం ఇవ్వండని కోరింది.
దీనిపై తాజాగా స్పందించిన ‘శాకుంతలం’ నిర్మాత నీలిమ గుణ ఓ కొత్త విషయాన్ని బయటపెట్టారు. సామ్ పిల్లల్ని కనేందుకు అంతా సిద్ధం చేసుకుందని, కానీ రెండు నెలల్లోనే ఏదో జరిగి ఉంటుందని చెప్పారు. “శాకుంతలం సినిమా కోసం మా నాన్న (దర్శకుడు గుణశేఖర్) సమంతను సంప్రదించారు. అప్పటికే ఆమె సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుంది. ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నట్లు చెప్పింది. కానీ శాకుంతలం కథ నచ్చడం వల్ల కొన్ని షరతులు విధించి ఒప్పుకొంది. జులై, ఆగస్టు నాటికి చిత్రీకరణ పూర్తిచేయాలని కోరింది. మేము దానికి అంగీకరించాం. ఈ చిత్రం తర్వాత విరామం తీసుకుని, తల్లి కావాలని ఆమె కోరుకుంది. తన ప్రాధాన్యత అదేనని చెప్పింది. కానీ ఇప్పుడు చైతూ-సామ్ విడిపోవడం షాకింగ్ గా ఉంది. జూలై వరకూ అంతా సక్రమంగానే ఉన్నట్టు అనిపించింది..కేవలం ఆగస్టు నెలలోనే ఏదో జరిగింది. అందుకే సమంత ఇలాంటి నిర్ణయం తీసుకుందేమో…” అని నీలిమ గుణ పేర్కొన్నారు.