
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసినప్పుడు సినిమాల గురించో లేక రాజకీయాల గురించో ప్రధానంగా చర్చించుకుంటారని అనుకుంటారు చాలా మంది. అయితే పవన్, త్రివిక్రమ్ ఆ రెండింటి మీదా కాకుండా.. సాహిత్యం మీదే ఎక్కువగా ముచ్చటించుకుంటారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడా ప్రస్థావన ఎందుకొచ్చిందంటే.. శుక్రవారం సాయంత్రం ‘భీమ్లా నాయక్’ సెట్లో .. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మహాకవి శ్రీశ్రీ రచనా వైశిష్ట్యం గురించి, ఆయన తన రచనల్లో పదాల్ని ఎలా పరుగులు పెట్టించి పాఠకుల్ని చైతన్య పరుస్తారు అనే విషయం గురించి .. ముఖ్యంగా యువరక్తాన్ని వేడెక్కించిన మహా ప్రస్థానం .. మహా కావ్యం గురించి చాలా ప్రత్యేకంగా చర్చించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ చేతిరాతతో ఉన్న ‘మహా ప్రస్థానం’ ప్రత్యేక స్మరణికను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దర్శకుడు త్రివిక్రమ్ కు జ్ఞాపికగా అందచేశారు.
ఆ పుస్తక ముద్రణ, అందులోని అరుదైన చిత్రాల గురించి వీరు ఇరువురూ చర్చించుకున్నారు. ‘శ్రీశ్రీ కవిత్వం గురించి రెండు మాటలు చెప్పండి… మీరు చెబితే వచ్చే అందం వేరు’ అని త్రివిక్రమ్ ని పవన్ కల్యాణ్ కోరగా త్రివిక్రమ్ స్పందిస్తూ “కవి తాలూకు ప్రయాణం అంటే ఒక జాతి తాలూకు ప్రయాణం. ఆయన వేసిన ఒక అడుగు.. రాసిన ఒక పుస్తకం.. ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటుంది” అని అన్నారు. ‘ఒక కవి గురించి మరో కవి చెబితే వచ్చే సొబగు ఇది’ పవన్ అన్నారు. వెంటనే త్రివిక్రమ్ స్పందించి ‘శ్రీశ్రీ అంటే ఒక సమున్నత శిఖరం. మనందరం ఆ శిఖరం దగ్గర గులక రాళ్లు’ అన్నారు. మొత్తం మీద ఈ ఇద్దరు మిత్రుల బహుమతి, ఆ బహుమతి అందుకున్న త్రివిక్రమ్ మాటలు మొత్తం మీద ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.