
శ్రీను వైట్ల టాలీవుడ్ అగ్రదర్శకుల జాబితాలో ఒక వెలుగు వెలిగినవాడు.. మాస్ స్టోరీ అండ్ క్లాస్ కామెడీ తో ఈయన తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. స్టార్ హీరోలతో భారీ సినిమాలు .. భారీ విజయాలతో ఆయన కెరియర్ కొనసాగింది. అయితే కొంతకాలంగా సక్సెస్ అనేది ఆయనకు అందుబాటులోకి రావడం లేదు. దాంతో సహజంగానే అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.
ప్రస్తుతం ఆయన చేతిలో మంచు విష్ణు ‘డి అండ్ డి’ తప్ప మరో ప్రాజెక్టు లేదు. ఈ సినిమా ఎప్పుడు మొదలుకానుందనే విషయంలో క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో తనకి బ్రేక్ ఇచ్చిన శ్రీను వైట్ల గురించి రవితేజ ఆలోచన చేశాడట. మంచి కథ .. నిర్మాతను చూసుకుంటే తాను డేట్స్ ఇస్తానని మాట ఇచ్చినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది.
నీ కోసం .. వెంకీ .. దుబాయ్ శీను వంటి హిట్లు ఇచ్చిన శ్రీను వైట్లకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా చేశాడు. కానీ ఆ సినిమా నిరాశ పరిచింది. అయినా మరోసారి ఛాన్స్ ఇవ్వడానికి రవితేజ సిద్ధపడటం విశేషం. మరి ఈ అవకాశాన్ని శ్రీను వైట్ల ఎంతవరకూ ఉపయోగించుకుంటాడో చూడాలి.