
పుణ్యక్షేత్రం.. శ్రీకాళహస్తి మహాక్షేత్రం. ఇక్కడ మహాశివుడు వాయులింగ రూపుడై.. స్వయంభువై వెలిశాడు. భిన్న సంస్కృతులకు, ప్రత్యేకతలకు నిలయం.. ఈ శైవాలయం. అందులో ముఖ్యమైనది.. పాతాళ గణపతి ఆలయం. సాధారణంగా గణపయ్య పూజలందుకోని ఆలయం ఉండదు. ప్రతి ఆలయంలోనూ గణపయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటారు. కానీ, ఇక్కడ మాత్రం సాక్షాత్తూ ఆ మహాకాయుడే.. స్వయంగా కదలివచ్చి తన తల్లిదండ్రుల చెంత కొలువుదీరాడు. ఈ పార్వతీ ప్రియనందనుడు.. తన తల్లిదండ్రులను వీడి ఒక్క క్షణమైనా ఉండలేడంటారు. అందుకేనేమో.. ఆది దంపతులకు తోడుగా స్వయంగా ఉద్భవించాడు.
నిజానికి శ్రీకాళహస్తి ఆలయం ఎప్పుడు నిర్మితమైందో చరిత్రలో లేదు. క్రీ.శ.1510లో శ్రీకృష్ణదేవరాయలు.. తన విజయానికి చిహ్నంగా ఇక్కడ.. ఈ ఆలయం ముందు ఓ రాజగోపురాన్ని నిర్మించాడు. అంటే.. అప్పటికే శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబికాదేవి సమేతుడై ఇక్కడ పూజలందుకుంటున్నాడు. దక్షిణ కాశీగా శ్రీకాళహస్తి క్షేత్రం విరాజిల్లుతోంది. ఈ ఆలయం నిర్మితమై వెయ్యి సంవత్సరాలై ఉంటుందనేది ఒక అంచనా. స్వర్ణముఖీ నది తీరాన ఈ ఆలయం నిర్మితమైంది. పూర్తిగా రాతి గోడలతో నిర్మితమైన ఆలయం ఇది. సిమెంటు లేని ఆ రోజుల్లో.. దానికి మారుగా బెల్లం, కరక్కాయ చూర్ణం, సున్నం, కోడిగుడ్డు సొన బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని వాడేవారట. రాత్రి పూట మాత్రమే ఈ ఆలయ నిర్మాణ పనులు జరిగేవట! ఎందుకంటే.. రాత్రి వేళ రాళ్లు మాట్లాడేవంటారు. పగలు టన్నుల కొద్దీ బరువుండే రాళ్లు కూడా.. రాత్రయ్యేసరికి దూదెపింజల్లా మారిపోతాయంటారు. అందుకే.. ఇక్కడ కూలీలు రాత్రివేళే పనిచేసేవారు. వారు పనికి వచ్చేటప్పుడు.. సమీపంలోని స్వర్ణముఖీ నదిలో ఇసుక గుట్టలు చేసి వస్తే.. పని పూర్తయ్యాక తిరిగి వెళ్లేసరికి ఆ గుట్టల్లో వారు చేసిన పనికి సరిపడా బంగారం దొరికేదట! అందుకే ఆ నదికి స్వర్ణముఖి అని పేరు వచ్చిందంటారు.
ఇలా.. అతి స్వల్ప వ్యవధిలోనే ఈ ఆలయ నిర్మాణం పూర్తయిందట. ఈ ఆలయంలోని విగ్రహలకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఆలయ మహాశిల్పి.. పరమశివుడికి మహా భక్తుడు. అందుకే ఆయన ఇక్కడి ప్రతి విగ్రహాన్నీ పరమ భక్తితో.. అద్భుతంగా మలిచాడు. నిర్మాణం పూర్తయ్యాక.. వాస్తుపండితులు ఆలయాన్ని సందర్శించి.. వాస్తుపరంగా అంతా సక్రమంగానే ఉన్నట్లు గుర్తించారు. వారు సందర్శించిన మూడవ రోజున ఆలయ మహాఉద్ఘాటనకు మూహూర్తంగా నిర్ణయించారు. రాజుగారికి ఈ విషయాన్ని చెప్పారు. వాస్తుపరంగా ఆలయంలో ఓ నుయ్యి ఉండాలని భావించి.. ఈశాన్య దిక్కున తవ్వించ వలసిందిగా రాజుగారికి విన్నవించారు. మూడు రోజుల్లో నుయ్యి పూర్తి కావాలన్న రాజుగారి ఆదేశానుసారం తవ్వకం పనులు మొదలయ్యాయి. ఇక మహాఉద్ఘాటన ముందురోజు మరోసారి అక్కడకు వేంచేసిన వాస్తునిపుణులు.. ఓ మహాపరాధాన్ని గుర్తించారు. అక్కడ అప్పటివరకు గణపతికి ఆలయం లేదని గమనించి.. శిల్పిని పిలిపించి.. నిలదీశారు. పరమశివుని ఆరాధనలో లీనమైపోయి ఉన్న ఆయన.. గణపయ్యను మరచానని, తనను మన్నించి కొంత గడువు ఇప్పించాలని కోరాడు. గణపతి లేకుండా ఆలయ ఉద్ఘాటన చేయకూడదని, ఇప్పుడు గడువు ఇవ్వాలంటే.. ఈ ముహూర్తం మళ్లీ రాదని వాస్తు నిపుణులు రాజుగారికి విన్నవించారు. దీంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన రాజుగారు.. తెల్లవారే సరికి ఎట్టి పరిస్థితుల్లోనూ గణపయ్య విగ్రహం ఉండి తీరాలని, లేకపోతే.. నీ తల కోట గుమ్మానికి వేలాడుతుందని శిల్పిని హెచ్చరించాడు.
శిల్పి దుఃఖంతో పడుకుండిపోయిన ఆ రాత్రి.. రాజు కలలోకి సాక్షాత్తూ ఆ గణనాథుడే వచ్చాడు. ఆలయానికి ఈశాన్య దిక్కున తవ్వుతున్న బావిలో తాను వెలశానని చెప్పాడు. తన తండ్రికి పరమ భక్తుడైన ఆ శిల్పిని రక్షించేందుకు తానే స్వయంగా తరలి వచ్చానన్నాడు. తన తల్లిదండ్రుల ఆలయ ఉద్ఘాటన నిర్విఘ్నంగా జరగాలని తాను స్వయంభువై వెలశానని చెప్పి అదృశ్యమయ్యాడు. దీంతో.. ఆ రాత్రికి రాత్రే రాజు ఆలయానికి చేరుకుని బావిలో చూడగా.. అక్కడ పాతాళ గణపయ్య స్వయంభువై కొలువుదీరి ఉన్నాడు. దీంతో.. నాటి నుంచి పాతాళ గణపయ్యగా ఆ గణాధిపుడు భక్తులను కటాక్షిస్తున్నాడు.
భూమికి దాదాపుగా 30 అడుగుల లోతున ఉండే ఈ పాతాళ గణపతి దర్శనానికి పిల్లలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. పెద్దలు అంత లోపలికి దిగేందుకు ఇబ్బంది పడతారు. స్వామి దర్శనానికి ఒక్కసారికి ఐదు మందిని మాత్రమే అనుమతిస్తారు. వారు దర్శనం చేసుకుని తిరిగి వచ్చాక మరో ఐదుగురికి ప్రవేశం కల్పిస్తారు. ఎందుకంటే.. లోపలికి వెళ్లేందుకు.. తిరిగి వచ్చేందుకు ఒకటే మెట్ల మార్గం ఉంటుంది. అది కూడా బాగా ఇరుకుగా ఉంటుంది. ఎక్కువ మందిని పంపితే.. ఆక్సిజన్ సంబంధిత ఇబ్బందులు వస్తాయన్నది కూడా మరో కారణం. ఇప్పుడు ఈ పాతాళ గణపతి ఆలయాన్ని కాస్తంత ఆధునికీకరించి ప్రత్యేకంగా కొత్త మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయానికి మరింత ప్రాచుర్యం కల్పించడంతో.. ఇప్పుడు భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గుడి ప్రాంగణంలోకి ప్రవేశించగానే కనిపించే ఈ పాతాళ గణపతిని దర్శనం చేసుకున్న తర్వాతే.. పరమేశ్వరుడి దర్శనానికి వెళ్లాలని పురాణం చెబుతోంది. ఈ పద్ధతిని అనుసరించి దర్శించుకున్న వాళ్లను ఈ పాతాళ గణపయ్య అనుగ్రహస్తాడని, అభీష్ట సిద్ధి కలిగిస్తాడని పెద్దలు చెబుతారు.
విజయవాడ లేదా గుంటూరు మీదుగా తిరుపతి వెళ్లే రైలెక్కి.. శ్రీకాళహస్తి స్టేషన్ లో దిగిపోవాలి. తిరుపతికి రెండు స్టాపింగుల ముందు ఈ స్టేషన్ వస్తుంది. ఇక్కడ దేవస్థానం ఉచిత బస్సు ఉంటుంది. ఆ బస్సులో ఎక్కితే.. ఆలయానికి తీసుకువెళుతుంది. లేదా ఆటో ఎక్కినా.. ఆలయానికి పది నిముషాల్లో చేరుకోవచ్చు.
రాయలసీమ మీదుగా వెళ్లే రైలెక్కితే.. తిరుపతిలో దిగి.. అక్కడి నుంచి బస్సులో శ్రీకాళహస్తి వెళ్లవచ్చు. దేవస్థానం ముందే దిగవచ్చు. తిరుపతి నుంచి ప్రతి 5 నిముషాలకు ఒక బస్సు శ్రీకాళహస్తికి బయలుదేరుతుంది. ఇక హైదరాబాద్ నుంచి బస్సులో వెళ్లాలన్నా.. తిరుపతిలో దిగి.. అక్కడి నుంచి శ్రీకాళహస్తికి వెళ్లాల్సిందే. వ్యక్తిగత వాహనాల్లో వెళ్లే వారికి రాయలసీమ మీదుగా వెళ్లడమే దగ్గరి దారి.