
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంట నడిచిన నేతల్లో వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా ఒకరు. చంద్రబాబు తో ఢీ అంటే ఢీ అని అరెస్ట్ అయ్యి.. అసెంబ్లీలో నిషేధం ఎదుర్కొని జగన్ కు బాసటగా నిలిచారు. కానీ జగన్ సీఎం అయ్యాక ఆమెను పక్కన పెట్టారు. సామాజిక కోణం చూపి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత అలిగిన రోజా కు ఏపీఐఐసీ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి కూల్ చేశారు. తాజాగా నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఉన్న ఎమ్మెల్యే రోజా పోస్ట్ ఊస్ట్ అయ్యింది. ఆమె చేస్తున్న ఐపీఐఐసీ చైర్మన్ పదవిని జగన్ తొలగించి మెట్టు గోవర్ధన్ రెడ్డికి అప్పగించారు. దీంతో రోజా సహా ఆమె అభిమానులు సైతం షాక్ అయ్యారు. రోజాకు తొలివిడతలో మంత్రి పదవిని జగన్ ఇవ్వలేదు. ఇక మలి విడతలో రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ విస్తరణలో ఇస్తారని అంటున్నారు. దానిపైనా క్లారిటీ లేదు. ఇప్పుడున్న పోస్ట్ ను సైతం జగన్ తొలగించడంతో రోజా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రోజాకు మంత్రి పదవి ఇవ్వడం కోసమే ఏపీఐఐసీ చైర్మన్ పోస్టు నుంచి తొలగించారా ? లేదా ఎమ్మెల్యేలకు జోడు పదవులు ఉండవద్దని జగన్ నిర్ణయం మేరకు రోజాను పక్కన పెట్టారా? అన్నది తేలాల్సి ఉంది. ఇక రోజాతో పాటు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు సైతం జగన్ షాక్ ఇచ్చారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్న ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం రోజాకు షాకిచ్చినట్టా? లేక మంత్రి పదవి కోసమా? అన్నది తేలాల్సి ఉంది.