
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటు పరం చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ సారి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో స్టీల్ ప్లాంట్ అంశాన్ని లేవనెత్తుతానని ఆయన అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు వచ్చే నెలలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేపట్టబోయే నిరసనలకు తాము మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులు మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయి రెడ్డి తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ విపక్ష నేతల మద్దతును కూడగట్టి పార్లమెంట్ లో తమ గళాన్ని వినిపిస్తామని ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేయడానికి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకమని, అందుకే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం సరికాదని చెప్పారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వైజాగ్ ప్లాంటుకు ఉన్న రుణాలను ఈక్విటీగా మార్చాలని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు బొగ్గు గనులను కేటాయిస్తే, ఖర్చులు బాగా తగ్గుతాయని అన్నారు.