
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక అనుమానితుడు సునీల్ కుమార్ యాదవ్ సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో ఉన్న పెద్ద నాయకుల నుంచి, సీబీఐ నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. సోమవారం కడప జిల్లా పులివెందులలోని నివాసంలో కిరణ్ విలేకరులతో మాట్లాడారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పెద్ద నాయకులు తప్పించుకునేందుకు తన అన్నను ఇరికిస్తున్నారని ఆరోపించారు. సునీల్ ను నిందితుడిగా చూపించేందుకు కాలువలో మారణాయుధాల పేరుతో సీబీఐ అధికారులు లేనిపోనివి సృష్టిస్తున్నారని చెప్పారు. వివేకాను హత్య చేసిందెవరో సీఎం జగన్ కు, ప్రజలకు కూడా తెలుసని అన్నారు.
వివేకానందరెడ్డి, తన అన్న మధ్య ఎలాంటి లావాదేవీలు జరగలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వివేకా బతికున్న సమయంలో రెండుమూడుసార్లు తమ ఇంటికి వచ్చినట్టు కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా సునీల్ భార్య లక్ష్మి మాట్లాడుతూ, వివేకా కుమార్తె హైకోర్టుకు సమర్పించిన జాబితాలోని 11 మంది అనుమానితులను సీబీఐ అధికారులు ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. తన భర్తను ఢిల్లీలో రెండు నెలలకు పైగా దారుణంగా హింసించారని, ఈ హత్య కేసులో ప్రమేయం ఉందని ఒప్పుకోవాలని కొట్టారని లక్ష్మి ఆరోపించారు. కాగా, వివేకా హత్య కేసులో విచారణకు సంబంధించి పులివెందుల మున్సిపల్ చైర్మన్ వల్లపు వరప్రసాద్ తో పాటు మరో పదకొండు మందిని సీబీఐ అధికారులు నిన్న విచారించారు. ఒక బృందం విచారణ సాగిస్తుండగా మరో బృందం మాత్రం ఈ హత్య కేసులో ఉపయోగించిన మారణాయుధాల కోసం అన్వేషిస్తోంది.