
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ బంద్ లో పాల్గొంటున్నాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం సహా టీడీపీ, ఎస్పీ, బీఎస్పీ, వైసీపీ, ఆమ్ ఆద్మీతో పాటు పలు రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. బంద్ నేపథ్యంలో.. ఢిల్లీలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసన శిబిరాల్లోని రైతులు ఢిల్లీలోకి రాకుండా ఏర్పాట్లు చేశారు. ఇండియా గేట్, విజయ్ చౌక్ లాంటి ముఖ్యమైన కూడళ్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏపీలో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. అధికార ప్రతిపక్షాలు బంద్ కు మద్దతు ఇవ్వడంతో.. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం వరకు బస్సులు కదలవని ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలకూ సెలవు ప్రకటించింది. బంద్ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. తిరుపతిలో రైతు సంఘాలతో కలిసి టీడీపీ, వామపక్షాలు, వివిధ కార్మిక సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించారు.
తెలంగాణలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హన్మకొండలో ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు యత్నించగా.. వామపక్ష నేతలు అడ్డుకున్నారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకోవడంతో.. వామపక్ష నేతలు వాగ్యుద్ధానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. అనంతరం పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్, వామపక్షాల నేతలు నిరసన తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం సహా పలు విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా నాయకులు.. బస్సులను అడ్డుకున్నారు. కాగా, భారత్ బంద్ సందర్భంగా నాయకులు ఎవరూ అత్యవసర సేవలకు ఆటకం కలిగించ వద్దని సంయుక్త కిసాన్ మోర్చా కోరింది. సాయంత్రం 4 గంటల వరకు భారత్ బంద్ కొనసాగనుంది.