
తమిళ నటి, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ షెడ్యూల్డ్ కులాలకు చెందిన దర్శకులు, నటీనటులను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసి చిక్కుల్లో పడింది. దళితులను ఇండస్ట్రీ నుండి తరిమేయాలని మీరా చెప్పడంతో ఆమెపై ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటిస్ యాక్ట్ క్రింద సెక్షన్ 153A(1)(a), 505(1)(b), 505 (2) ప్రకారం కేసులు నమోదయ్యాయి.
దీంతో మీరా మిథున్ అరెస్ట్ ఖాయం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు తెగ హల్చల్ చేశాయి. ఈ విషయంపై మీరా మిథున్ స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను పోలీసులు అరెస్ట్ చేయడమనేది సాధ్యమయ్యే పని కాదని పేర్కొంది. అది కలలోనే జరుగుతుందని, ఒకవేళ నిజంగా సాధ్యమైతే తనను నిర్భయంగా అరెస్ట్ చేసుకోవచ్చని కూడా ఛాలెంజ్ చేసింది.
ఈ పరిస్థితుల నడుమ కేరళలో తలదాచుకున్న మీరా మిథున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు అరెస్టు చేయడానికి ముందు ఆమె రచ్చ రచ్చ చేసింది. పెద్దగా అరుస్తూ పోలీసులు తనను వేధించడానికి ప్రయత్నిస్తున్నారని, అలాగే వాళ్ళు టార్చర్ పెడుతన్నారంటూ ఊగిపోయింది. ”ఆడవాళ్లకు రక్షణ లేదా? పోలీసులు అంతలా టార్చర్ చేస్తున్నారు. ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించండి” అంటూ మీరా కన్నీళ్లు పెట్టుకుంటూ అరిచింది. అంతేకాదు ‘నన్ను ముట్టుకుంటే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటా’ ఆమె బెదిరించడం గమనార్హం.