
తెలంగాణను కేసీఆర్ భ్రష్టు పట్టిస్తుంటే.. దేశాన్ని మోదీ నాశనం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని, ప్రపంచ దేశాల ముందు ఒక శక్తివంతమైన దేశంగా నిలబడిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొస్తే.. మోదీ ఈ దేశాన్ని అదానీ, అంబానీలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల నడ్డి విరుస్తున్నారన్నారు. పెట్రో ధరలు పెంచుతూ ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు.
‘‘దేశంలో నరేంద్ర మోదీ.. తెలంగాణలో కేసీఆర్.. ఇద్దరూ ఇద్దరే. తెల్లదొరల ఫాసిస్ట్ విధానాలను అమలు చేస్తున్నారు. మోదీ, కేసీఆర్ ల ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. వాళ్లను ప్రజలే ఓడించాలి. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోరే.. సోనియా తెలంగాణ ఇచ్చారు. కానీ, కేసీఆర్ పాలనలో బలహీన వర్గాలు మరింత బలహీనంగా తయారవుతున్నాయి. దేశంలో మోదీ.. రాష్ట్రంలో కేసీఆర్ గద్దె దిగితేనే సామాన్య ప్రజలకు మేలు జరుగుతుంది…’’ అని రేవంత్ పేర్కొన్నారు.