
తెలంగాణ కేబినెట్ 57 ఏళ్ల వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. రాష్ట్రంలోని 57 ఏళ్ల వయసు దాటిన వారికి వెంటనే వృద్ధాప్య పింఛన్ అందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మరో 6,62,000 కొత్తగా పింఛన్లు అందనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 58 లక్షలకు పెరగనుంది. కుటుంబంలో ఒక్కరికే పింఛన్ పద్ధతిని కొనసాగిస్తూ.. భర్త చనిపోతే భార్యకు భార్య చనిపోతే భర్తకు వెంటనే పింఛన్ బదిలీ చేయాలని, ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. దోభీ గాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ నివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
జిల్లాల్లో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల సమాచారాన్ని అధికారులు కేబినెట్ ముందుంచారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని, ఔషధాలు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించింది. కొత్తగా మంజూరైన ఏడు వైద్య కళాశాలల ప్రారంభంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. వచ్చే విద్యా సంవత్సరమే వైద్య కళాశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంపై మంత్రివర్గం చర్చించింది. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ఈనెల 16 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
50వేల రూపాయల్లోపు పంట రుణాల మాఫీని ఈ నెల 15నుంచి… నెలాఖరు లోపు పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రుణమాఫీ అంశంపై కేబినెట్ లో చర్చ జరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు పంటరుణ మాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థికశాఖ మంత్రివర్గం ముందు ఉంచింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారంతో ఇప్పటివరకు 25వేల వరకు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేసినట్లు అధికారులు తెలిపారు. 50వేల వరకు ఉన్న రుణాల మాఫీని ఈ నెల 15 నుంచి నెలాఖరు వరకు పూర్తి చేయాలని కేబినెట్ ఆదేశించింది. మంత్రివర్గం నిర్ణయంతో 6లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఆయా రైతుల ఖాతాల్లో మాఫీ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేయనుంది. వానాకాలం పంటల సాగుపై మంత్రివర్గం భేటీలో చర్చ జరిగింది. వర్షాలు, పంటలు, సాగునీరు, ఎరువుల లభ్యతపై చర్చించింది. తెలంగాణలో పత్తికి ఉన్న డిమాండ్ దృష్ట్యా పత్తి సాగు పెంచాలని నిర్ణయించింది. పత్తిసాగు పెంపునకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.
కేంద్రం ప్రవేశ పెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పై తెలంగాణ కేబినెట్ లో చర్చ జరిగింది. రూ.8లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేళ్లు సడలింపు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.