
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. గత రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిరిసిల్ల పట్టణం దాదాపుగా వరద నీటితో నిండిపోయింది. రద్దీగా ఉండే పాతబస్టాండ్, వెంకంపేట, ప్రగతినగర్, పెద్దబజార్, కరీంనగర్ రోడ్డు, శాంతినగర్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల ప్రధాన రహదారి సమీపంలో ఉన్న కొత్త చెరువు పూర్తిగా నిండి వరదనీరు రోడ్డుపైకి పారుతోంది. చెరువు సమీపంలో ఉన్న పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. పట్టణంలో అమ్మకాల కోసం ఉంచిన పలు వినాయక విగ్రహాలు వరదలో కొట్టుకెళ్లాయి. వరదనీటిలో కొట్టుకొచ్చిన ఓ వ్యక్తిని స్థానికులు బయటకు తీశారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
సిరిసిల్ల సమీపంలో ఉన్న బోనాల చెరువు ప్రమాదకరంగా మారింది. ఏ సమయంలోనైనా చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు కలెక్టరేట్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.