
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరా కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిన్న నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఈ సభలో మాట్లాడుతూ పోలీసులపై ఆరోపణలు గుప్పించారు. సభకు రాకుండా తమ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఆదిలాబాద్ జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర స్పందించారు. రేవంత్ వ్యాఖ్యల్లో నిజం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ సభ కోసం జిల్లా పోలీసులు మూడు రోజులు బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని విధాలా సహకరించారని అన్నారు. ఈ సభకు పదివేల మంది మాత్రమే హాజరవుతారని అనుమతి పొందారు కానీ, అంతకుమించి తరలించినా ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇకపై ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.