
ఇంద్రవెల్లిలో దళిత దండోరా సభను పెట్టి సూపర్ సక్సెస్ చేసిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫిర్యాదు చేశారని ప్రచారం జరుగుతోంది. భువనగిరి ఎంపీనైన తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఈనెల 18న ఇబ్రహీంపట్నంలో సభ నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించడంపై కోమటిరెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌కు వలస వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టడంపై కినుకగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రేవంత్ దూకుడు కూడా నచ్చడం లేదు.
టీపీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకునే ముందు పార్టీలోని సీనియర్లను కలుపుకు పోవడానికి కోమటిరెడ్డి వద్దకు కూడా వెళ్లాలని రేవంత్ భావించారు. కానీ, టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఎవరూ తనను కలవడానికి రావద్దని కోమటిరెడ్డి ప్రకటించి రేవంత్‌ను తన వద్దకు రానీయకుండా చేశారు. అయితే, ఇబ్రహీంపట్నంలో సభ విషయంలో మాత్రం నేరుగా పార్టీ అధినేత్రి సోనియాకే ఫిర్యాదు చేశారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మాణికం ఠాగూర్ కూడా ఇదే విషయంలో రేవంత్ తీరుపై అసహనంతో ఉన్నారని తెలుస్తోంది.