
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లోని 4 కి.మీ. పరిదిలో సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిషేధించినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొన్నారు. వివిధ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో జరిగే చర్చలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఈ నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. శుక్రవారం ఉదయం 6గంటల నుంచి ఈ నిషేదాజ్ఞలు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ముగిసే వరకూ వర్తిస్తాయని ఆయన తెలిపారు.
ఆరు నెలల వ్యవధిలో అసెంబ్లీ భేటీ కావాల్సి ఉన్న నేపథ్యంలో శుక్రవారం నుంచి సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ రూపొందించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన అంశాలపై టీఆర్ఎస్ఎల్పీ భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా తాజా సమావేశాల్లో దళిత బంధు పథకానికి చట్టబద్ధత కల్పించడంతోపాటు పలు అంశాలను ప్రస్తావించాలని అధికార పార్టీ భావిస్తోంది. కీలకమైన బిల్లులను కూడా ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరో వైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నాయి.