
రిజర్వేషన్లు మా హక్కు అని భిక్ష కాదని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. ‘‘వెయ్యి గురుకులాలు పెట్టి.. విద్యావ్యవస్థ మారిపోయిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేద బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల్లో 4 లక్షల మందే గురుకులాల్లో చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మిగతా 30 లక్షల మంది పేద బిడ్డలకు విద్య బంద్ చేస్తే బంగారు తెలంగాణ ఎలా అవుతుంది?’’ అని ఆయన ప్రశ్నించారు. నల్గొండలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్పసభలో ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. బీఎస్పీ జాతీయ కో ఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్తగా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణలో బహుజన రాజ్యం రాబోతుందని అన్నారు. ప్రజలు కారు కింద పడతారా.. ఏనుగు ఎక్కి వెళ్తారా తేల్చుకోవాలన్నారు.
“అయ్యా సీఎం.. మీరు ఖర్చు పెడతానన్న రూ.1000 కోట్లు ఎవరివి? బడుగు జీవుల శ్రమ కాదా? వాటిని ఎందుకు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు? మా మీద ప్రేమ ఉంటే.. మీ ఆస్తులు అమ్మి పెట్టండి. మా బతుకులు బాగుపడాలంటే అత్యున్నత ప్రమాణాలున్న విద్య, వైద్యం, ఉపాధి కావాలి. బిడ్డా ఉద్యోగం ఎందుకు వదిలేశావు అని మా అమ్మ అడిగింది. లక్షలాది మంది బిడ్డల బతుకు మార్చాలంటే.. త్యాగం చేయాల్సిన అవసరముందని చెప్పాను. 17 ఏళ్ల పోలీసు జీవితాన్ని వదులుకుని 2012లో గురుకులాల సొసైటీకి వచ్చాను. తొమ్మిదేళ్లలో ఎన్నో గొప్ప పనులు చేశా. ఒక గిరిజన బిడ్డ ఎవరెస్టు ఎక్కి, అక్కడ అంబేడ్కర్ బొమ్మను పెట్టింది. గురుకులాల్లోని పిల్లలు ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. వీళ్లకేం చేతనైతది అన్న వారే ముక్కుమీద వేలు వేసుకునేలా చేశాను. మా బిడ్డలు చదువుకుంటే మీ కళ్లకు మంట. మేం జీవితాంతం గొర్లు, బర్లు కాయాలా? కల్లుగీత కార్మికులుగా బతకాలా? ఇంజినీర్లు, వ్యోమగాములయ్యేది ఎప్పుడు ? అని ప్రశ్నించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఉద్యోగాలంటూ వార్తలొస్తున్నాయి.. కానీ ఉద్యోగాల ప్రకటనలు రావడం లేదు. అధికారంలోకి వచ్చినప్పుడు ఉస్మానియా లాంటి 5-10 ఆసుపత్రులు వస్తాయన్నారు. కరోనా సమయంలో అవి ఎక్కడికి పోయాయి? ఈ మాటల గారడీతో ఆరేళ్లుగా ప్రజలు మోసపోతున్నారు. గత 70 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలను పాలించిన 11 మందిలో 10 మంది ఆధిపత్య కులాలకు చెందినవారే. మాకు పాలన చేతకాదనా? మీరే అపరమేధావులా? మీరే 60 వేల పుస్తకాలు చదువుతారా… మాకు చదువు రాదనుకుంటున్నారా? జనాభా ప్రాతిపదికన అధికారంలో వాటా ఇవ్వాలి. లేకుంటే గుంజుకుంటాం…” అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.