
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ పీరియాడికల్ కథ కాగా.. శంకర్ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఉండనుంది. ఆ తర్వాత చేయబోయే సినిమా స్పై థ్రిల్లర్ అని తెలుస్తోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తి చేసిన తర్వాత చరణ్.. శంకర్ దర్శకత్వంలో నటిస్తారు. ఈ సినిమా షూటింగ్ నవంబరులో ప్రారంభమవుతుంది. దీని తర్వాత ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించనున్నారు. ఇటీవలే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఈ సినిమా కథ గురించిన ఓ వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ సినిమాలతో మెప్పించిన గౌతమ్ తిన్ననూరి.. ప్రస్తుతం హిందీలో ‘జెర్సీ’ రీమేక్ చేస్తున్నారు. తాజాగా చరణ్ తో సినిమా ప్రకటించారు. దీనిని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. ఇందుకోసం స్పై థ్రిల్లర్ కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మూడు టైమ్ లైన్స్ లో ఈ స్టోరీ ఉంటుందని సమాచారం. 2023 సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. శంకర్ సినిమాను పూర్తి చేసిన తర్వాత చరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. చరణ్ తన సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చాలనే ఉద్దేశంతో యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమాలకు మాత్రమే ఓకే చెబుతున్నారు.