
గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. భద్రతా కారణాలతో సుమారు 8 లక్షల యాప్‌లపై ఈ రెండు సంస్ధలు నిషేధం విధించాయి. ‘పిక్సలేట్’ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా గూగుల్, యాపిల్ స్టోర్ల నుంచి యాప్ లను నిషేధించారు. హెచ్ 1 2021 డీలిస్టెడ్ పేరుతో పిక్సలేట్ ఓ నివేదికను తయారు చేసింది. ఇందులో మోసపూరితమైన, హానికరమైన 8,13,000 యాప్ ల జాబితాను పొందుపరిచింది. ఈ యాప్ లు కెమెరా, జీపీఎస్ వంటి వాటి ద్వారా యూజర్ డేటాను సేకరిస్తున్నట్టు నివేదికలో వెల్లడించారు.
వీటిలో 86 శాతం యాప్ లు 12 ఏళ్లలోపు పిల్లలే లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించామని నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ఆధారంగా మొత్తం 8,13,000 యాప్ లపై నిషేధం విధించింది. తొలగించిన యాప్స్‌కు సుమారు 2.1 కోట్ల యూజర్ల రివ్యూలు నమోదయ్యాయని వెల్లడించింది. ఇప్పటికీ ఆ యాప్‌లను కస్టమర్లు వాడే చాన్స్ ఉన్నదని పిక్సలేట్ పేర్కొంది. కనుక స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫోన్ల ప్లే స్టోర్లలో ఒకసారి చెక్ చేసుకుని సదరు యాప్స్‌ను తొలగించాలని సూచించింది.