
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కలిసి ఒకే తెరపై సందడి చేస్తే చూడాలనేది ప్రతి అభిమాని కోరిక. అయితే ఇంత వరకు ఇది సాధ్యం కాలేదు. గతంలో చిరు నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో.. పవన్ ఓ గెస్ట్ రోల్ చేశాడు. అయితే అది పూర్తి స్థాయి పాత్ర కానందున ఫ్యాన్స్ ఆశ నెరవేరలేదు. కానీ త్వరలోనే ఫ్యాన్స్ కోరిక తీరనున్నట్లు తెలుస్తోంది. ఈ మెగాబ్రదర్స్ కలిసి నటించేందుకు సిద్ధమయ్యారని మరోసారి ప్రచారం ఊపందుకుంది.
చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం 154 వ చిత్రాన్ని ప్రారంభించారు. బాబీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం డిసెంబర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. వైజాగ్ పోర్ట్ నేపథ్యంలో సాగే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది అని లీకులందుతున్నాయి. ముఠామేస్త్రిలో చిరంజీవి పాత్రని మించి మాసిజం కనిపిస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఈ వార్త హల్ చల్ చేస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని చిరంజీవి బ్రదర్ పాత్ర కోసం చూపించేందుకు బాబీ ఆసక్తిగా ఉన్నాడట. ఇందుకోసం పవన్‌ని సంప్రదించినట్టు కూడా టాక్ విన్పిస్తోంది. ఆ పాత్ర చాలా బలంగా ఉంటుందని.. నేరుగా సొంత తమ్ముడు పవన్ కల్యాణ్ నే రంగంలోకి దించితే ఆ పాత్ర ఇంకా బాగా పండుతుందని.. దాంతో పాటు సినిమా మైలేజ్ వస్తుందని బాబీ ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ సినిమాలో పవన్ నటిస్తాడా? నటిస్తే పూర్తి స్థాయి పాత్రా? లేదా గెస్ట్ రోలా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒక వేళ ఈ అంచనాలు నిజమై చిరు, పవన్ ఒకే తెరపై కనిపిస్తే.. మెగా అభిమానులకు పండగనే చెప్పాలి. ఇక, చిరు.. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతోపాటు ‘గాడ్ ఫాదర్’, ‘భోళాశంకర్’ చిత్రాల్లోనూ నటిస్తుండగా.. పవన్ కల్యాణ్ ‘భీమ్లానాయక్’, ‘హరిహర వీరమల్లు’, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.