
భారత యువ జట్టు కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో శిఖర్ ధావన్ కెప్టెన్ గా శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా యువ జట్టు దూసుకుపోతుంది. యువ ఆటగాళ్లతో కూడిన జట్టు, ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపిస్తుంది.
ఈ సిరీస్ లో భాగంగా ఇప్పటికే మొదటి వన్డేలో ఈజీగా గెలిచిన టీమిండియా, రెండో వన్డేలో ఓటమి అంచులో ఉన్నపటికీ, వెరవకుండా బ్యాటింగ్ చేసిన బౌలర్ దీపక్ చాహర్ అద్భుత పోరాటంతో గ్రాండ్ విక్టరీ సాధించింది. యువ భారత జట్టు శ్రీలంక గడ్డపై అదరగొడుతోంది. ఇప్పటికే 2 మ్యాచ్ లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఈరోజు లంకతో జరిగే మూడో వన్డే లో తలపడుతోంది. మూడో వన్డే ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవడంతో ఇప్పుడు క్లీన్ స్వీప్ లక్ష్యంగా టీమిండియా బరిలో దిగుతోంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడం తో టీమిండియా జట్టు ప్రయోగాలు చేయదానికి సిద్ధంగా వుంది. ఇందులో భాగంగా రిజర్వ్ బెంచ్ ను పరీక్షించబోతోంది. రిజర్వ్ ఆటగాళ్లతో లంకను వైట్ వాష్ చేయాలని టీమిండియా చూస్తోంది. తొలి రెండు వన్డేల్లో టీమిండియా దుమ్ములేపింది. గెలవాలనే కసితో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక గత మ్యాచ్ లో టీమిండియాను గెలిపించిన దీపక్ చాహర్ కు విశ్రాంతినిచ్చి నవదీప్ సైనీకి అవకాశం ఇవ్వొచ్చు.
గాయం నుంచి కోలుకున్న సంజూ శాంసన్ కు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇషాన్ కిషన్ స్థానంలో సంజు శాంసన్ కు చోటు దక్కవచ్చు. ఇక రెండో వన్డేలో విఫలమైన కుల్దీప్ స్థానంలో రాహుల్ చాహర్ లేదా వరుణ్ చక్రవర్తుల్లో ఒకరికి చాన్స్ దక్కే అవకాశం ఉంది.
అయితే రెండు వన్డేల్లో ఓడిపోయిన శ్రీలంక పరిస్థితి దారుణంగా ఉంది. రెండో వన్డేలో అద్భుతంగా రాణించినా విజయం ముంగిట ఆ జట్టు బోల్తా పడింది. టీమిండియాను మొత్తం ఆలౌట్ చేయలేకపోతోంది. మూడో వన్డేలోనైనా సత్తా చాటాలని భావిస్తోంది. రెండో వన్డేలో దాదాపు గెలుపు ఖాయమై.. అనుభవలేమితో చేజేతులా విజయాన్ని దూరం చేసుకుంది. గత మ్యాచ్ లో గాయపడ్డ భానుక రాజపక్స్ స్థానంలో పాతుమ్ నిస్సంకను తీసుకోవచ్చు. ఇక లక్షన్ సందకన్ స్థానంలో అకిలా ధనుంజయకు అవకాశం ఇవ్వచ్చు.