
సాధారణ ఎన్నికల స్థాయిలో జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు.. రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ‘మా’ అధ్యక్ష రేసులో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు హోరాహోరీగా తలపడుతున్నారు. ప్రకాశ్ రాజ్.. తన ప్యానెల్ ను ఇప్పటికే ప్రకటించగా.. మంచు విష్ణు మాత్రం ఈ విషయంలో తొలి నుంచీ గోప్యత పాటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నటుడు రఘుబాబు.. విష్ణు ప్యానెల్ నుంచి బరిలో నిలుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోటీ పడనున్నట్లు సమాచారం.
విజయం కోసం ఆయన అప్పుడే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే పదవి కోసం ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి జీవితా రాజశేఖర్ పోటీలో ఉండగా.. బండ్ల గణేశ్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న విషయం తెలిసిందే. విమర్శలు, ప్రతి విమర్శలతో తొలి నుంచీ హాట్ హాట్ గా సాగుతున్న ఈ ఎన్నికలు.. అక్టోబరు 10న జరగనున్నాయి. అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపునే ప్రారంభించి.. రాత్రికి ఫలితాలు ప్రకటించనున్నారు. తొలిసారిగా ‘మా’ ఎన్నికల బరిలో నిలుస్తున్న రఘుబాబు అదృష్టం ఎలా ఉందో చూడాలి మరి!