
ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ లో వున్న సీనియర్ లీడర్ లని కాదని రాహుల్, సోనియా గాంధీ ఈయనని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. టీపీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్ దూకుడు మరింత రెట్టింపు అయిందనే చెప్పాలి. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక పాత కాంగ్రెస్ నేతలపై దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ ని వదిలి వెళ్లి ఇతర పార్టీల్లో చేరిన నేతలను , ఖాళీగా వున్న నేతలని అందరిని కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తానికి ఆయన చేసే పని ఫలించేలా వుంది. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పూర్వ నేతలని కలిశారు అందులో భాగంగానే మహబూబ్ నగర్, భూపాలపల్లి, నిజామాబాద్ జిల్లాల వారీగా వివిధ పార్టీలో ఉన్న నేతలను కలిసి వారిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరారు. అదే విధంగా మొన్నటి వరకు కాంగ్రెస్ లో వుండి మొన్నీమధ్యనే బయటకు వచ్చిన మాజీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని కూడా టీపీసీసీ చీఫ్ కలిసారు. కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డికి రేవంత్ రెడ్డి కోరారు. ఆయనతో రేవంత్ జరిపిన చర్చలు ఫలించాయి. కాంగ్రెస్‌లో తిరిగి చేరేందుకు విశ్వేశ్వర్ రెడ్డి అంగీకరించారు. ఈ ఇద్దరి భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ మంచి కోసం పరితపిస్తుంటారని, ఆయనతో రాష్ట్ర రాజకీయాల పై కాకుండా రాష్ట్రాభివృద్ధిపై చర్చించామని తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్ అప్పుల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదని, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌లను అడిగితే పది పైసల వడ్డీకే రూ.వేల కోట్లు ఇస్తారని చెప్పారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎప్పుడైనా కాంగ్రెస్‌లోకి రావొచ్చని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి పీసీసీ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆయనతో తెలంగాణ అభివృద్ధిపైనే చర్చించామని చెప్పారు. కాంగ్రెస్ చేపట్టే నిరుద్యోగ దీక్షలో పాల్గొంటానని కూడా ప్రకటించారు. కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరేది త్వరలో చెబుతానని చెప్పారు.