
హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి పూర్తిగా తగ్గకముందే.. ఈటెల భూ కబ్జా వ్యవహారాన్ని ప్రభుత్వం మరో సారి తెరపైకి తెచ్చింది. ఈ విషయంలో అధికారులు మరోసారి చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లా హకీంపేటలో సర్వే చేయనున్నట్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. సర్వే నంబర్ 97లోని భూములను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని జమున హేచరీస్ యజమానులైన ఈటెల సతీమణి జమున, ఆమె కుమారుడు నితిన్ రెడ్డికి తూప్రాన్ ఆర్డీవో నోటీసులు జారీ చేశారు. జూన్లో కరోనా కారణంగా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో 3 రోజుల పాటు తిరిగి విచారణ చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ చెప్పారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన కొందరు రైతులకు ప్రభుత్వం అసైన్ చేసిన భూములను ఈటెల రాజేందర్ కబ్జా చేశారని ఆరోపిస్తూ గత మే నెలలో కొందరు సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అప్పట్లోనే ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవికి ఈటెల రాజీనామా చేసి, సర్వే నిర్వహించడంపై కోర్టుకు వెళ్లారు. కొవిడ్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని సర్వేను నిలిపివేయాలని జూన్ లో కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, హుజూరాబాద్ కు ఉప ఎన్నిక రావడం, ఈటెల బీజేపీలో చేరి గెలవడం చకచకా జరిగిపోయాయి. అయితే, గతంలో నిలిపివేసిన విచారణను పూర్తి చేసేందుకు తాజాగా ఈటెల కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.